గుడ్లకు ఎథనాల్ దెబ్బ
ఎథనాల్ తయారీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో.. దీని ప్రభావం బియ్యంతో పాటు పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. పౌల్ట్రీ రంగానికి అత్యంత కీలక ముడిపదార్థమైన మొక్కజొన్న ధరలు గణనీయంగా పెరగడమే దీనికి కారణం. ఏడాది కాలంలో మొక్కజొన్న ధర భారీగా పెరిగింది. మూడేళ్ళ క్రితం టన్ను మొక్కొజన్న ధర రూ. 14,000 ఉండగా, ఇపుడు రూ. 26500 దాటిందని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. పౌల్ట్రీ పరిశమ్రలో ముడిపదార్థాల వ్యయం 60 నుంచి 70శాతం మొక్కజొన్నకే పోతుంది. ఇపుడు కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నను ఎథనాల్ తయారీకి కేటాయించడంతో కొరత తీవ్రమైంది. మొత్తం మొక్కజొన్న ఉత్పత్తిలో ఏకంగా 37 శాతం ఉత్పత్తిని ఇపుడు ఎథనాల్ డిస్టలరీలు వాడుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌ను వాడుతున్నారు. దీన్ని ఇక ఏమాత్రం పెంచినా… మొక్క జొన్న కొరత మరింత పెరిగే అవకాశముంది. మొక్కజొన్న ధర అనూహ్యంగా పెరగడంతో గుడ్ల ధరలు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నారు. గతంలో ఎక్స్‌ఫామ్ కోడి గుడ్డ ధర రూ. 7లోపు ఉండగా, ఇపుడు రూ. 8.50 నుంచి రూ. 9 మధ్య ఉంటోంది. వీటిల్లో క్వాలిటీని బట్టి కూడా మారుతోంది. చౌకరకం దాణా వాడే పౌల్ట్రీ పరిశ్రమలో ధరలు కాస్త తక్కువ ఉన్నా… నాణ్యమైన దాణా వాడే వ్యాపారవేత్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇపుడు రకరకాల కోడిగుడ్ల మార్కెట్‌లోకి వచ్చాయి. సహజసిద్ధంగా కోళ్ళను పెంచితే… వాటి కోడి గుడ్ల ధర రూ. 25 మించుతోంది.
