ఎమ్మెల్యే గాంధీకి ఈడీ నోటీసు
సాహితి ఇన్ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసులో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన తమ ముందుకు హాజరు కావాలని నోటీసులో ఈడీ పేర్కొంది. ఫ్లాట్లు, విల్లాలు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రీ-లాంచ్ ఆఫర్ల కింద సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జనం నుంచి భారీ ఎత్తున నిధులను సేకరించింది. ఇలా వసూలు చేసిన తొలుత సుమారు రూ.248 కోట్లని భావించారు. అయితే ఈడీ రంగంలోకి దిగిన తరవాత జనాలకు సుమారు రూ.842 కోట్ల మేర మోసం చేసినట్లు ఈడీ అంచనా వేసింది. ఇలా సేకరించిన మొత్తం రూ. 2.1 కోట్లు గాంధీకి చెందిన ఖాతాల ద్వారా బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అధికారులు నోటీసు ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఈడీ జప్తు చేసింది. అలాగే ఈ కేసు కింద సుమారు రూ.161 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. సాహితి ఇన్ఫ్రాటెక్ కేసులో ఆ సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు తదితరులపై దర్యాప్తు కొనసాగుతోంది. లక్ష్మీనారాయణ టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. కేసు నమోదు తరవాత ఆయన రాజీనామా చేశారు.
