For Money

Business News

మెప్పించని డాక్టర్‌ రెడ్డీస్‌ పనితీరు

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పనితీరు మార్కట్‌ అంచనాలను అందుకోలేక పోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.706.50 కోట్లకు చేరింది. అలాగే రూ.5,320 కోట్లుగా వెల్లడించింది. సీఎన్‌బీసీ టీవీ 18 నిర్వహించిన పోల్‌లో విశ్లేషకులు ఈ త్రైమాసికంలో రూ. 5478 కోట్ల అమ్మకాలపై రూ. 755 కోట్ల నికర లాభం అంచనా వేశారు. రెండు అంశాల్లోనూ కంపెనీ మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. కంపెనీ మార్జిన్‌ మాత్రం 22.5 శాతం నుంచి 23.8 శాతానికి పెరిగింది. ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు గణనీయంగా తగ్గటంతో లాభం భారీగా పెరిగిందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పరాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నికర లాభం రూ.19.8 కోట్లుగా ఉంది. దీనికి కారణం ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు రూ.597.2 కోట్ల నుంచి రూ.4.7 కోట్లకు తగ్గడమే. డిసెంబరు త్రైమాసికంలో గ్లోబల్‌ జెనరిక్స్‌ విక్రయాలు గణనీయంగా పెరగటంతో టర్నోవర్‌ నిలకడగా ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. ఈ త్రైమాసిక కాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాల కోసం రూ.416 కోట్లు వెచ్చించింది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 35 శాతంగా ఉంది. ఈ కాలంలో అమెరికా విక్రయాలు 7 శాతం పెరిగి రూ.1,860 కోట్లకు చేరాయి. యూరప్‌ మార్కెట్లో మాత్రం విక్రయాలు 2 శాతం తగ్గి 410 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. భారత మార్కెట్లో కొత్త ఔషధాల విడుదల చేయటంతో ఆదాయం 7 శాతం పెరిగి రూ.1,030 కోట్లుగా నమోదు కాగా వర్ధమాన మార్కెట్లలో ఆదాయం రూ.1,150 కోట్లుగా ఉందని పేర్కొంది. సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్‌ లైట్‌కు సంబంధించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షల డేటాను డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు ఇప్పటికే సమర్పించామని, అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు దీపక్‌ పేర్కొన్నారు.