మద్యం స్కామ్: ఆంధ్రప్రభ ఆఫీస్‌లో ఈడీ బృందం
ఢిల్లీ మద్యం స్కామ్‌లో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. నిజానికి కొన్ని పేర్లు ఫిర్యాదులో ఉన్నా… ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒక్కో ఆధారంగా ముందుకు సాగుతోంది. ఇవాళ దేశ వ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో పలు చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ జర్నలిస్ట్ సర్కిల్లో గత నెల రోజుల నుంచి వినిపిస్తున్న వదంతులు నిజమేనని తేలుతున్నాయి. ఈ స్కామ్‌లో మీడియా రంగానికి చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించాడని ఢిల్లీ మీడియా రాసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ మీడియా సంస్థకు చెందిన అర్జున్ పాండే ఈ స్కామ్‌లో కీలక పాత్ర ఉందని రాశారు. అర్జున్ పాండే పేరు సీబీఐ చార్జిషీటులో ఉంది. ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్న అర్జున్ పాండేను 15వ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. అర్జున్ పాండే గతంలో హైదరాబాద్‌కు చెందిన మీడియా సంస్థ ఆంధ్రప్రభ గ్రూప్ సంస్థలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రభ గ్రూప్ ‘ఇండియా అహెడ్’ అనే న్యూస్ ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛానల్‌కు సేల్స్ హెడ్‌గా అర్జున్ పాండే గతంలో పనిచేశారని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేసిన అర్జున్ పాండే మద్యం కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇండియా అహెడ్ ఛానల్‌ను ముత్తా ఫ్యామిలీ నిర్వహిస్తున్నా… జేయుస్ నెట్వర్కింగ్ ప్రైవేట్ లిమిటడ్ (ZEUS NETWORKING PRIVATE LIMITED)తో ఉన్న లింకుల గురించి ఈడీ ఇపుడు దర్యాప్తు చేస్తోంది. ఈ కంపెనీలో ముత్తా గౌతమ్, బోయిన్పల్లి అభిషేక్ డైరెక్టర్లుగా ఉన్నారు. నిజానికి ఈ కంపెనీని 2010లో నెలకొల్పినా.. 2021 అక్టోబర్‌లో బొయన్పల్లి అభిషేక్ డైరెక్టర్‌గా చేరారు. చిత్రంగా ఈ కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సీడీజీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ డైరెక్టర్లు పంకజ్ అరోరా, అర్పితా అరోరా. వీరికీ ఇపుడు మద్యం కేసులో తరుచూ వినిపిస్తున్న దినేష్ అరోరాల మధ్య ఆర్థిక లావాదేవాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అభిషేక్ బొయనపల్లి, ముత్తా గౌతమ్ తరఫున అర్జున్ పాండేతో పాటు అరోరాలు కూడా పనిచేశారా? అన్న కోణంలో ఇపుడు దర్యాప్తు సాగుతోంది. మద్యం షాపులు దక్కించుకోవడం కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దలు భారీ స్థాయిలో లాబీయింగ్ చేసినట్లు సమాచారం.