క్రిప్టో కరెన్సీ బిల్లు ఇపుడే కాదు!
క్రిప్టో కరెన్సీ అంటేనే దొంగ సొమ్మును విదేశాలకు తరలించే మార్గం అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇటీవల కర్ణాటకలో రాజకీయ నేతలు తమ అక్రమ సొమ్మును క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు తరలించారనే ఆరోపణలు వచ్చాయి. ఇవాళ కూడా తమిళనాడుకు చెందిన ఓ మాజీ మంత్రి తన అక్రమ సంపాదనను క్రిప్టో కరెన్సీలో దాచినట్లు రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి వాతావరణంలో క్రిప్టో కరెన్సీ తెచ్చే అంశంపై కేంద్రం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ బిల్లు తేవడంలో ఏమాత్రం తొందరపడినా… అక్రమ సొమ్ము తరలించడానికి అవినీతి పరులకు సాయం చేసేందుకే కేంద్రం తొందరపడుతోందంటూ విపక్షాలు ఆరోపించే అవకాశముంది. పైగా యూపీతో పాటు పలు కీలక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోపై తొందర పడకూడదని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ జరిగే కేబినెట్ పరిశీలనకు క్రిప్టో కరెన్సీ బిల్లు రావాల్సి ఉంది. కాని ఇవాళ్టి కేబినెట్ మీటింగ్ అజెండాలో క్రిప్టో కరెన్సీ బిల్లు లేదని తెలుస్తోంది.