కరోనా ఎఫెక్ట్: 18200 దిగువకు నిఫ్టి
ఉదయం అనుకున్నట్లే నిఫ్టి 18450పైన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా.. అమెరికా ఫ్యూచర్స్ లాభాల్లో ఉన్నా… నిఫ్టి ఏకంగా186 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఒకదశలో 18162 పాయింట్లను తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో స్వల్పంగా కోలుకుని 18199 వద్ద ముగిసింది. నెన్సెక్స్ కూడా 635 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి ఒక శాతం నష్టపోగా, ఇతర ప్రధాన సూచీలన్నీ ఒకటిన్నర శాతంపైగా నష్టంతో ముగిశాయి. కేవలం ఒకే ఒక్క ప్రధాన సూచీ గ్రీన్‌లో ముగిసింది. అది ఫార్మా సూచీ. చైనాతో పాటు ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలతో ఈ కౌంటర్లో మద్దతు లభించింది. ఇదే కారణంతో అనేక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో ఒత్తిడి వచ్చింది. అలాగే కరోనా సమయంలో దారుణంగా దెబ్బతిన్న హోటల్ రంగానికి చెందిన షేర్లు కూడా ఇవాళ భారీగా నష్టపోయాయి. ఇవాళ లాభాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో అన్ని ఫార్మా షేర్లే. వీటిలో అపోలో హాస్పిటల్స్ కూడా ఉంది. ఇవాళ నిఫ్టి టాప్ లూజర్స్‌లో అదానీ ఎంటర్‌ప్రైజస్ ఉంది. ఈ షేర్ ఆరు శాతం క్షీణించింది. ఇక అదానీ పోర్ట్స్ కూడా రెండు శాతం నష్టపోయింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో ఎల్ఐసీ ఇవాళ దారుణంగా దెబ్బతింది. ఈ షేర్ మళ్ళీ రూ.700 దిగువకు పడిపోయింది. పీఎస్‌యూ బ్యాంకుల్లో మిడ్ క్యాప్ షేర్లు, న్యూఏజ్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మిడ్ క్యాప్ కౌంటర్లలో ఇండియన్ హోటల్స్ 4.5 శాతం నష్టంతో క్లోజైంది. ఇటీవల భారీగా పెరిగిన మిడ్‌క్యాప్ బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి. నిఫ్టి బ్యాంక్‌లోని 12 షేర్లూ నష్టాలతో ముగియడం విశేషం.