For Money

Business News

మరో హైదరాబాదీ టీకాకు ఓకే

కొవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కొత్త వ్యాక్సీన్‌కు ఇవాళ అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య వారి కోసమని ఆ వ్యాక్సీన్ తయారీదారు, హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్ ఈ’ వెల్లడించింది. ఇప్పటి వరకు టీనేజర్లకు కేవలం భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇపుడు ఈ వ్యాక్సిన్‌ కూడా ఆమోదం లభించింది. జనవరి 3వ తేదీ నుంచి టీనేజర్లకు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సీన్‌కు కార్బివ్యాక్స్ అని పేరు పెట్టారు. ఇది దేశంలో అభివృద్ధి చేసిన తొలి ఆర్‌డీబీ వ్యాక్సిన్‌. ఈ విషయమై బయోలాజికల్ ఈ లిమిటెడ్ స్పందిస్తూ ‘‘బయోలాజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్, దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌డీబీ) ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగానికి భారతదేశం యొక్క డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందింది’’ అని పేర్కొంది. డోస్‌ ధర రూ.145లని, జీఎస్టీ అదనమని కంపెనీ పేర్కొంది. ఈ నెలాఖరులోగా ఈ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.