For Money

Business News

బొగ్గు ధరలు పెంపు… విద్యుత్తుపై భారం

కార్మికుల వేతనాలను పెంచాల్సి రావడం, వ్యయం పెరగడం కారణంగా బొగ్గు ధరలను కనీసం 10 నుంచి 11 శాతం పెంచాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. 2018 నుంచి బొగ్గు ధరలను కోల్‌ ఇండియా పెంచలేదు. సగటును ఇపుడు టన్ను బొగ్గు రూ. 1,394 చొప్పున విక్రయిస్తోంది. మారిన వాతావరణంలో ధరలు పెంచక తప్పడం లేదని కోల్‌ ఇండియా అంటోంది. కంపెనీ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు కంపెనీ అధికారులు అంటున్నారు. వేతనాల సవరణ కారణంగా మరో రూ. 10,000 కోట్ల భారం అదనంగా కంపెనీపై పడనుందని అంటున్నారు. మరోవైపు సిమెంట్‌, స్టీల్‌ రంగానికి సరఫరా చేస్తున్న ధరలతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు తక్కువ ధరకు బొగ్గు సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ బొగ్గు ధరలను పెంచనున్నట్లు పేర్కొంది. బొగ్గు ధరలు పది శాతం పెరిగే పక్షంలో విద్యుత్ చార్జీ యూనిట్‌కు 20 నుంచి 30 పైసలు పెరిగే అవకాశముంది.