నిర్మలమ్మ ‘గోల్డన్’ ట్రిక్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెడుతూ బంగారంపై దిగుమతి సుంకం 12.5 శాతం నుంచి పది శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో చాలా మంది బంగారం ధరలు తగ్గుతాయని ఆశించారు. బంగారం స్మగ్లింగ్ ఇటీవల బాగా పెరిగిందని… దీని కారణంగా బంగారం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తారని గత కొన్ని రోజుల నుంచి మార్కెట్లో చర్చ కూడా జరిగింది. నిర్మలా సీతారామన్ ప్రకటనతో అందరూ బంగారం తగ్గుతాయని భావించారు. అయితే బులియన్ మార్కెట్ వర్గాలు దీన్ని ఖండించాయి. ఎందుకంటే బంగారం దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను 2.5 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు ఈ వర్గాలు తెలిపాయి. అంటే బంగారం ధరలు ఎలాంటి మార్పు లేదన్నమాట. ఈ మాత్రానికి ప్రకటన దేనికోనని చాలా మంది విమర్శిస్తున్నారు.