రాజీవ్ హయాంలోనే నా కెరీర్ ఊపందుకుంది
తాను, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడం వల్ల… పదే పదే తనను టార్గెట్ చేస్తున్నారని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాల గురించి మాట్లాడారు. తన బిజినెస్ కెరీర్ రాజీవ్ గాంధీ హయాంలోనే ఊపందుకుందని ఆయన అన్నారు. ఎగుమతి దిగుమతి విధానంలో రాజీవ్ సంస్కరణలు తెచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ తరవాత 1991లో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో ఇతర పారిశ్రామిక వేత్తల మాదిరిగానే తనకు కూడా ప్రయోజనం కల్గిందని అన్నారు. 1995లో గుజరాత్ ముఖ్యమంత్రిగా కేశుభాయ్ పటేల్ ఉన్నపుడే తన బిజినెస్ కెరీర్ టర్నింగ్ పాయింట్ వచ్చిందని అన్నారు. అపుడే తాను ముంద్రాలో తొలి పోర్టును ప్రారంభించినట్లు చెప్పారు. 2001లో నాల్గవ టర్నింగ్ పాయింట్ వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ సీఎంగా గుజరాత్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల అనేక పరిశ్రమలు రావడమేగాక… ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని అన్నారు.