స్థిరంగానే బంగారం, వెండి ధరలు
దేశంలో బులియన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.36 తగ్గి రూ.45,888కి చేరింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కాస్త బలపడటమే ఇవాళ దేశీయంగా బంగారం ధరల స్వల్ప తగ్గుదలకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో పెద్ద మార్పు లేదు. అలాగే వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో మార్కెట్లో కిలో వెండి ధర రూ.73 తగ్గి రూ.61,911కు చేరింది. అమెరికా మార్కెట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. డాలర్ ఇండెక్స్ 0.2 శాతం తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,794 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర 23.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.