రాపిడో, ఊబర్‌కు సుప్రీం షాక్
ఢిల్లీలో ఊబర్, రాపిడో బైక్ ట్యాక్సీలు నడపడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎలాంటి పర్మిట్లు లేకుండా ఈ సర్వీసులు నిర్వహించకుండా ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ సంస్థలు బైక్ ట్యాక్సీలు నడపడం చట్ట విరుద్ధమని పేర్కొంది. బైక్ ట్యాక్సీలకు సంబంధించి తాము కొత్త విధానాన్ని తయారు చేస్తున్నామని… ఈలోగా వీటిని నిర్వహించరాదని సుప్రీం కోర్టులో వాదించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. అయితే కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఈ రెండు సంస్థలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.