For Money

Business News

బ్యాంకుల ప్రైవేటీకరణ వాయిదా?

శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీ కరణ బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో క్రిప్టో కరెన్సీ డీల్స్‌లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని తేలడంతో… దీనిపై కేంద్ర వెనకడుగు వేసింది. ఇప్పట్లో ఈ బిల్లు తెస్తే విపక్షాలు అనవసర వివాదాలు సృష్టిస్తాయని కేంద్రం భావిస్తోంది. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం వెనకడుగు వేసింది. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటే ముందుగా ఆ మేరకు ఇపుడున్న చట్టాలను పార్లమెంటు ఆమోదంతో మార్చాల్సి ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులు సమ్మె చేశారు. కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించరాదని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది. 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ సహా రెండు పీఎస్‌బీల ప్రైవేటీకరణను ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాలని 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రైవేటీకరణ కోసం నియమించిన కేబినెట్‌ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.