బజాజ్ ఆటో ఫలితాలు భళా…
ప్రముఖ టూ, త్రీ వీలర్ కంపనీ బజాజ్ ఆటో కంపెనీ తాజా ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 1469 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 1332 కోట్లతో పోలిస్తే 10.3 శాతం పెరిగింది. కాని మూడో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 21 శాతం పెరిగింది. అయితే తాజా నికర లాభంలో రూ. 315 కోట్ల అసాధరణ లాభం కూడా కలిపి ఉంది. ఇక కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.2 శాతం తగ్గి రూ. 7975 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాది (21-22) తీసుకుంటే కంపెనీ రూ. 33145 కోట్ల ఆదాయంపై రూ. 5019 కోట్ల నికర లాభం ఆర్జించినట్లయింది. చిప్స్ వంటి కీలక పరికరాల లభ్యత లేని కారణంగా అమ్మకాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ అంటోంది. దేశీయంగా, దేశీయ కమర్షియల్ వెహికల్స్ విభాగంలో 47 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రంగంలో తమ వాటా 62 శాతమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది 25 లక్షల వాహనాలను అమ్మినట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. ఇవాళ ఫలితాలను పరిగణనలోకి తీసుకునేందుకు భేటీ అయిన బజాజ్ ఆటో బోర్డు షేర్‌కు రూ. 140 డివిడెండ్ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిడెండ్ కింద కంపెనీ రూ. 4051 కోట్లు చెల్లించనుంది. ఈ స్థాయి డివిడెండ్ చెల్లించిన తరవాత కూడా కంపెనీ వద్ద రూ. 19,090 కోట్ల నగదు నిల్వ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.