For Money

Business News

32% తగ్గిన నికర లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికాని (క్యూ1)కి అరబిందో ఫార్మా రూ.520.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం నికర లాభం రూ.770 కోట్లతో పోలిస్తే 32.4 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఆదాయం మాత్రం 9.4 శాతం పెరిగి రూ.5,702 కోట్ల నుంచి రూ.6,236 కోట్లకు చేరింది. పరిశోధన, అభివృద్ధిపై చేసిన ఖర్చు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.3 శాతం నుంచి 5 శాతానికి తగ్గినట్లు కంపెని వెల్లడించింది. జూన్‌ త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి కంపెనీ రూ.310 కోట్లు వెచ్చించింది.
తొలి త్రైమాసికంలో ఫార్ములేషన్ల విక్రయాలు 9 శాతం వృద్ధితో రూ.4,890 కోట్ల నుంచి రూ.5,329 కోట్లకు చేరాయి. అమెరికాలో ఫార్ములేషన్ల విక్రయాలు 10.8 శాతం పెరిగి రూ.2,681 కోట్ల పెంచి రూ2,971 కోట్లకు పెరిగాయి. మొత్తం ఫార్ములేషన్ల విక్రయాల్లో వర్థమాన మార్కెట్ల వాటా 31 శాతం పెరిగి రూ.430.6 కోట్లకు చేరాయి.
ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా అనుబంధ సంస్థ యూగియా ఫార్మా స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ను పునర్‌వ్యవస్థీకరించే/వేరు చేసే ప్రతిపాదనను కంపెనీ బోర్డు వాయిదా వేసింది. వాటాదారుల విలువను పెంచే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సంతృప్తికర ఫలితాలను ప్రకటించగలిగినట్లు అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే నిత్యానంద రెడ్డి తెలిపారు. స్పెషాలిటీ ఔషధాల అభివృద్ధిపై కంపెనీ దృష్టి భవిష్యత్తు వృద్ధికి దోహదం చేయగలదన్నారు.