46 శాతం తగ్గిన నికర లాభం
కరోనా సమయంలో వచ్చిన వాపు తగ్గుతోంది. కంపెనీలన్నీ మళ్ళీ పాత లాభాలకు మళ్ళుతున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజస్ రూ .90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.168 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ. ఇదే సమయంలో హాస్పిటల్ టర్నోవ్ రూ .2,868 కోట్ల నుంచి 24 శాతం పెరిగి రూ .3,546.40 కోట్లకు చేరింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కోసం రూ .88.2 కోట్లను కేటాయించడంతో లాభం తగ్గిందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. వచ్చే మూడేళ్లలో 300 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ .23,000 కోట్లు) స్థూల వ్యాపార విలువను (జీఎంవీ) సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పూర్తి ఏడాది ఆర్థిక పరిస్థితి చూస్తే 2021-22 లో ఏకీకృత నికర లాభం రూ. రూ .1,056 కోట్లకు చేరింది. 2020-21లో ఇది రూ .150 కోట్లుగా ఉంది. కంపెనీ టర్నోవర్ రూ .10,560 కోట్ల నుంచి రూ .14,663 కోట్లకు పెరిగింది. రూ .5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ .11.75 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.