అరబిందో ‘శరత్ పాత్ర’పై అనలిస్టుల ఆందోళన
అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ గవర్నన్స్ (కంపెనీ నిర్వహణ) విషయమై స్టాక్ మార్కెట్ అనలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలపై కంపెనీ బోర్డు అనలిస్టులతో కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించింది. ఇందులో చాలా మంది అనలిస్టులు అరబిందో ఫార్మా కార్పొరేట్ గవర్నన్స్ గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు సీఎన్‌బీసీ టీవీ 18 పేర్కొంది. ఏకంగా కంపెనీ ప్రమోటర్, డైరెక్టర్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ కావడంతో … దాని ప్రభావంపై వీరు కంపెనీ పెద్దల నుంచి వివరణ కోరారు. శరత్ రెడ్డి ఐటీ, లాజిస్టిక్ వ్యవహారాలు చూసేవారని, ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించినట్లు కంపెనీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. శరత్ రెడ్డి ఇక నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారని కంపనీ పేర్కొంది. అరబిందో కంపెనీ లావాదేవీలతో లిక్కర్ స్కామ్‌కు సంబంధం లేదని యాజమాన్యం పేర్కొంది.
ప్రత్యేక కథనాలు
అరబిందో కంపెనీ ప్రమోటర్లు లిక్కర్ స్కామ్ వంటి వ్యవహారాల్లో మళ్ళీ ఇరుక్కోవడంపై జాతీయ బిజినెస్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన మనీ కంట్రోల్ వెబ్సైట్ కూడా అరబిందో కార్పొరేట్ గవర్నన్స్‌పై నిలదీసింది. కంపెనీ ప్రమోటర్లు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం ఇది మొదటిసారి కాదని.. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఇరుక్కున్న విషయాన్ని మనీ కంట్రోల్ ప్రస్తావించింది. కంపెనీ ప్రమోటర్ పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి కుమారుడైన శరత్ చంద్రా రెడ్డి… ఇదే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కె నిత్యానంద రెడ్డి అల్లుడు కూడా అని ఆ వెబ్సైట్ రాసింది. ఇంత పెద్ద కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి (అరబిందో కంపెనీకి సంబంధం లేకున్నా)… బయట మనీ లాండరింగ్ పాల్పడినట్లు చార్జిషీట్లు దాఖలైతే.. ఇన్వెస్టర్లు సదరు కంపెనీని ఎలా విశ్వసిస్తారని ఆ వెబ్సైట్ పేర్కొంది. అరబిందో ఫార్మాలో శరత్ చంద్రా రెడ్డి ఏడాదికి రూ. 1.46 కోట్ల జీతం తీసుకుంటున్నారని… కంపెనీ వార్షిక నివేదికలు చూస్తే 2007 నుంచి కంపెనీకి చెందిన ప్రాజెక్టులు, ప్రొక్యూర్మెంట్, ఐటీ వంటి కీలక విభాగాలను ఆయన చూశారని పేర్కొంది. అరబిందో రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ, సీఎస్ఆర్ కమిటీలలో కూడా సభ్యుడిగా ఉన్నారని మనీ కంట్రోల్ పేర్కొంది. అరబిందో ఫార్మా కార్పొరేట్ గవర్నన్స్ను ప్రశ్నిస్తూ జాతీయ మీడియాలో పలు వార్తలు వచ్చాయి.