ప్చ్… లాభాల్లో 467 శాతమే వృద్ధి…
ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కంపెనీ రూ.1,607 కోట్లు నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సాధించిన ఆర్జించిన నికర లాభం రూ. 284 కోట్లతో పోలిస్తే ఇది 467 శాతం అధికం. అయినా మార్కెట్ వర్గాలు వేసిన అంచనా మొత్తాన్ని కంపెనీ అందుకో లేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2451 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే త్రైమాసికంలో ఎయిర్టెల్ కన్సాలిడెటెడ్ ఆదాయం 32,805 కోట్లకు చేరింది. గత ఏడాదితో (రూ.27,064) పోలిస్తే ఆదాయం 22 శాతం పెరిగింది. కాగా ఒక్కో వినియోగదారుడినుంచి వచ్చిన సగటు ఆదాయం (Average Revenue Per User -ARPU) రూ.146 నుంచి రూ. 183కి చేరింది. ఎబిటా (EBITDA) మార్జిన్ 50.6 శాతంగా కంపెనీ పేర్కొంది. మొబైల్ రెవెన్యూ 27.4 శాతం పెరిగింది. గత ఏడాదిలో అదనంగా 2.08 కోట్ల 4జీ కస్టమర్లు తమ కంపెనీలో చేరినట్లు తెలిపింది. ఒకో నెలకు ఒకో కస్టమర్ సగటున 19.5జీబీ మొబైల్ డేటా వాడినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే సగటున ఒక్కో కస్టమర్ నెలకు 1,104 నిమిషాల వాయిస్ డేటాను వాడినట్లు పేర్కొంది.