ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఐపీఓ… దరఖాస్తు చేయొచ్చా?
ఏటీఎం, మేనేజ్మెంట్ సర్వీలు అందిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. మార్కెట్ నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసేందుకు ఈ ఆఫర్ చేస్తున్నారు. షేర్ ధర శ్రేణి రూ. 166- రూ. 175. ఈ ఆఫర్ 21వ తేదీన ముగుస్తుంది. మార్కెట్‌లో ఆఫర్ చేస్తున్న రూ. 600 కోట్లో కొత్త ఈక్విటీ లేదు. అంటే ప్రమోటర్లు తమ వాటా కొంత భాగాన్ని అమ్ముతున్నారు. ఇతర ఇన్వెస్టర్లు కూడా తమ వాటా విక్రయిస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే ఇపుడున్నవారు తమ వాటాను అమ్మడానికి ఈ పబ్లిక్ ఆఫర్ చేస్తున్నారు. ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గుతున్నందున… ఈ కంపెనీ బిజినెస్‌పై పలు బ్రోకింగ్ సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గడచిన మూడు సంవత్సరాల నుంచి కంపెనీ ఆదాయం క్షీణిస్తూనే ఉంది. అలాగే నికర లాభం కూడా. గత ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసిన ఏడాదిలో రూ. 1,797 కోట్ల టర్నోవర్‌పై రూ.54.70 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఆ తరవాతి ఆరు నెలల కాలంలో రూ. 753 కోట్ల టర్నోవర్‌పై రూ.18 కోట్ల నికర నష్టం చూపుతోంది. అప్పులు రూ. 880 కోట్లు దాకా ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ఈ షేర్ అనధికార మార్కెట్‌లో రూ. 550 పలికింది. కాని ఇపుడు ఇష్యూ ధరకు రూ 20 ప్రీమియంతో ఉంది. సెకండరీ మార్కెట్ బలహీనంగా ఉన్నందున ఈ ప్రీమియం కూడా పోయేలా ఉంది. చూస్తుంటే ఈ ఇష్యూ డిస్కౌంట్‌కు లిస్టయినా ఫరవాలేదు. ప్రస్తుత అనిశ్చితిలో ఈ ఐపీఓకు దరఖాస్తు చేయడం కంటే… లిస్టయిన తరవాత పడినపుడు కొనే అంశాన్ని పరిశీలించండి.