For Money

Business News

అదానీ విల్మర్‌: యాంకర్‌ ఇన్వెస్టర్ల జోరు

అదానీ గ్రూప్‌లోని వంట నూనెల కంపెనీ అదానీ విల్మార్ పబ్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది. ఇవాళ యాంకర్‌ ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లను కేటాయించింది. 15 యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.939.9 కోట్లను సమీకరించింది. 4.08 కోట్ల ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ. 230 చొప్పున కేటాయించింది. ఐపీఓలో షేర్‌ ధర రేంజ్‌ను రూ 218 నుంచి రూ. 230 లకు ఆఫర్‌ చేయనుంది. అంటే గరిష్ఠ ధరకు యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించింది. షేర్లను పొందిన కంపెనీల్లో సింగపూర్ గవర్నమెంట్, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, జూపిటర్ ఇండియా ఫండ్, వోల్‌రాడో వెంచర్ పార్ట్‌నర్స్ ఫండ్, సొసైటీ జనరల్, కోహెషన్ ఎమ్‌కె బెస్ట్ ఐడియాస్, విన్రో కమర్షియల్, డొవెటైల్ ఇండియా ఫండ్‌తో సహా పలు కంపెనీలు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్టీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ మరియు సన్ లైఫ్ ఎక్సెల్ ఇండియా ఫండ్ కూడా యాంకర్ బుక్ ద్వారా ఇన్వెస్ట్‌ చేశాయి.
పబ్లిక్ ఇష్యూ ద్వారా అదానీ విల్మార్ రూ. 3,600 కోట్లను సమీకరించాలని ప్రతిపాదించింది. ఉద్యోగులకు రూ. 107 కోట్ల విలువైన షేర్లను, కంపెనీ వాటాదారులకు రూ. 360 కోట్ల విలువైన షేర్లు కేటాయిస్తోంది. అదానీ విల్మార్ షేర్‌లను ఇన్వెస్టర్లకు ఈ ధరకు కేటాయిస్తారో అందులో రూ.21 తగ్గింపుతో ఉద్యోగులకు కేటాయిస్తారు. ఆఫర్‌లో సగం అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులకు (QIIలకు), 15 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. ఇవన్నీ పోగా మిగిలిన 35 శాతం షేర్లను మాత్రం రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు.