For Money

Business News

గట్టెక్కిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ FPO

అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చివరి రోజుల గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్‌ చేయకపోయినా… సొంత కంపెనీ ఉద్యోగులు కూడా సగమంది దరఖాస్తు చేయకున్నా ఎఫ్‌పీఓ సక్సెస్‌ అయింది. దీనికి కారణం పెద్ద ఇన్వెస్టర్లు చివరి రోజున అదానీకి అండగా రావడమే. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఎఫ్‌పీఓకు 1.12 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయింది ఈ ఆఫర్‌. రూ. 20,000 కోట్లు సమీకరించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 4.55 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా 5.08 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షేర్‌ను రూ. 3,112 నుంచి రూ. 3,276లకు ఎఫ్‌పీఓ కింద జారీ చేయగా.. ఇవాళ మార్కెట్‌లో ఈ షేర్‌ రూ. 2975 వద్ద ముగిసింది. అంటే మార్కెట్‌లో చీప్‌గా దొరుకుతున్నా… పెద్ద ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఓకు దరఖాస్తు చేశారన్నమాట. రీటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో కేవలం 12 శాతం మాత్రమే సబ్‌స్క్రయిబ్‌ అయింది. రూ. 64 డిస్కౌంట్‌ ఇచ్చినా… రీటైల్‌ ఇన్వెస్టర్లు ఈ షేర్ల జోలికి పోలేదు. సొంత ఉద్యోగులకు కేటాయించిన షేర్లలో కేవలం సగం మంది మాత్రమే దరఖాస్తు చేశారు. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కేటగిరలో కేటాయించిన షేర్లు 3.32 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అంటే రీటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లు కూడా పెద్ద ఇన్వెస్టర్లకు కేటాయిస్తారన్నమాట.