ఆ రుణాలు ఎంతో చెప్పండి?
ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో బడ్జెట్లో స్పష్టం చేస్తుంది. సాధారణంగా బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలు తక్కువగా ఉంటాయి. పైగా విద్యుత్, గృహ నిర్మాణం వంటి కొన్ని కార్పొరేషన్లు మినహా… రాష్ట్ర ప్రభుత్వం ఇతర అప్పులు చేయలేదు. అయితే బడ్జెట్లో చూపని రుణాలను భారీ మొత్తంలో ఏపీ ప్రభుత్వం సమీకరించిందని కేంద్రానికి అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. దీనిపై వివరణ కోరింది కేంద్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రం నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి కేంద్రం నుంచి తాకీదు వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న అప్పులపై వివరాలు సమర్పించాలని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ( పీఏజీ ) కార్యాలయం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ రాసింది . ప్రభుత్వ పథకాల అమలుకు బడ్జెట్లో చూపని రుణాల వివరాలు చెప్పాలని పేర్కొంది. ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాల వివరాలను తెలపాలని లేఖలో స్పష్టం చేసింది. రుణం తీసుకున్న సంస్థ పేరు, ఏ ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకున్నారు? ఎంత మొత్తంలో తీసుకున్నారు ? తదితర అంశాలను నిర్దేశిత ఫార్మాట్లో వివరాలు ఇవ్వాలని పీఏజీ కార్యాలయం సూచించింది. ప్రభుత్వ హామీకి సంబంధించిన ఉత్తర్వులను కూడా అందజేయాలని కోరింది. రుణాలకు సంబంధించిన వివరాలను ఈనెల 31 లోపు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని పీఏజీ కార్యాలయం కోరింది. గతంలోనే ఈ వివరాలు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో మరోసారి లేఖ రాస్తూ.. ఓ హెచ్చరిక కూడా చేసింది. రాష్ట్రం నుంచి స్పందన లేకుంటే సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంస్థ ఆధీనంలో ఉంటారు)కు ఫిర్యాదు చేస్తామని కేంద్రం ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.