ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి
అంతర్జాతీయ మార్కెట్ ప్రధాన కరెన్సీలతో డాలర్ దూసుకుపోతోంది. ముఖ్యంగా చైనా, జపాన్‌తోపాటు యూరోపియన్ కరెన్సీలతో చాలా ఫాస్ట్‌గా బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ 104కి చేరింది. దీంతో గత కొన్ని రోజులుగా బలంగా ఉన్న రూపాయి బలహీనపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇవాళ ఇంటర్ బ్యాంక్ ఎక్స్ఛంజ్ మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో రూపాయి విలువ 0.3 శాతం వరకు క్షీణించి 77.28కి పడిపోయింది. గత కనిష్ఠ స్థాయి 76.98 నుంచి దిగిపోయింది. అంటే గతంలో 76.98 రూపాయిలు ఇస్తే ఒక డాలర్ వచ్చేది. ఇపుడు 77.18 ఇస్తేగాని ఒక డాలర్ రాదన్నమాట. రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ విఫల ప్రయత్నం చేసింది. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు లాభాల స్వీకరణ అనే అనుకున్నాం… కాని వారు పెట్టుబడులు వెనక్కి తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి పలు కంపెనీల ఫలితాలు వెల్లడి అయ్యాయి. చాలా కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. పైగా క్రూడ్ ధరలూ పెరుగుతూనే ఉన్నాయి. డాలర్, క్రూడ్… రెండూ పెరగడంతో రూపాయిని కాపాడటం ఆర్బీఐకి కూడా కష్టంగా మారింది.