ఎల్ఐసీ ఐపీవో వాయిదా తప్పదా?
అమెరికా వడ్డీ రేట్ల పెంపుతో పాటు బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల మన మార్కెట్లలో కొనసాగుతూనే ఉన్నాయి. వాటి అమ్మకాలను తట్టుకోవడం దేశీయ ఇన్వెస్టర్లకు కష్టంగా ఉంది. నిజానికి విదేశీ ఇన్వెస్టర్లు ఇపుడు కేవలం లాభాలు మాత్రమే స్వీకరిస్తున్నారని… వారు పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్ళలేదని సమాచారం. పెట్టుబడులు వెనక్కి వెళితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ ఐపీవోతో ముందుకు రావడం మంచి కాదని అధికారులు భావిస్తున్నారు. దీంతో మే నెలలో కాకుండా ఆగస్టులో ఐపీఓకు వస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఇపుడు కేంద్రంలో తర్జనభర్జనలు సాగుతుననాయి. కేవలం దేశీ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ ఆధారంగా ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్‌తో ముందుకెళ్లాలనే ప్రతిపాదన ఉన్నా.. అది సెకండరీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎల్ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేసేందుకు చాలా మంది ఇన్వెస్టర్లు ఇపుడున్న షేర్లను తెగనమ్మే పరిస్థితి రావొచ్చు. దేని బదులు అంతర్జాతీయ మార్కెట్లు కుదుటపడిన తరవాత విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్లోకి వచ్చేంతవరకూ వేచిచూడాలని మరికొందరు సూచిస్తున్నారు. వాస్తవానికి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను మార్చి నెలలోనే తెచ్చేందుకు ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధమయ్యింది. అయితే హఠాత్తుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రావడంతో ఇష్యూను వాయిదా వేయక తప్పలేదు.