రూ. 757 కోట్ల ఆస్తులు జప్తు
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ. 757.77 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. తమిళనాడులోని డిండిగల్ జిల్లాలో ఉన్న కంపెనీ ఫ్యాక్టరీ ప్లాంట్, ప్లాంట్ & మెషినరీ, వాహనాలు, బ్యాంకు అకౌంట్లు, ఫిక్సెడ్ డిపాజిట్లను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. రూ. 411.83 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను 36 బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.345.94 కోట్లను జప్తు చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ మల్టి లెవల్ మార్కింట్ వ్యాపారం ముసుగులో ఈ కంపెనీ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ల ధరల కంటే పలు రెట్లు అధిక ధరలకు ఈ కంపెనీ తన ఉత్పత్తులను అమ్మినట్లు ఈడీ పేర్కొంది. ఆమ్వే ఉత్పత్తులను కొని వినియోగించడం బదులు… వాటి ద్వారా భారీ లాభాలు సాధించడానికి ప్రయత్నించినట్లు ఈడీ పేర్కొంది. 2002-2003 నుంచి 2021-22 మధ్య కాలంలో ఆమ్ వే కంపెనీ వ్యాపార లావాదేవీల నుంచి రూ.27,562 కోట్లు వసూలు చేసిందని, అందులో రూ.7,588 కోట్లను కమిషన్ రూపంలో ఏజెంట్లకు చెల్లించిందని ఈడీ వెల్లడించింది. కంపెనీ ఉత్పత్తులకు బదులు తమ సభ్యులను ఎలా ధనువంతులు చేయాలనే అంశంపైనే కంపెనీ శ్రద్ధ చూపిందని పేర్కొంది.1996-97లొ ఆమ్వే కంపెనీ భారత్‌కు రూ. 21.39 కోట్లను తెచ్చిందని… 2020-21 కల్లా దాదాపు రూ.2859 కోట్లను మాతృసంస్థలకు డివిడెండ్, రాయల్టి, ఇతర చెల్లింపులు రూపేణా చెల్లించిందని ఈడీ వెల్లడించింది. బ్రిట్ వరల్డ్ వైడ్ ఇండియా, నెట్వర్క్ ట్వెంటీ వన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఆమ్వేకు సాయం చేశాయని తెలిపింది.