వొడాఫోన్‌లో పెరిగిన ప్రమోటర్ల వాటా
వొడాఫోన్ ఐడియాలో బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ తన వాటాను 47.61 శాతానికి పెంచుకుంది . తన అనుబంధ సంస్థ ప్రైమ్ మెటల్స్ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఐడియాలో 7.61 % వాటాకు సమానమైన 2,18,55,26,081 షేర్లు ప్రైమ్ మెటల్ వద్ద ఉన్నాయని.. తాజాగా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో 57,09,58,646 షేర్లను కొనుగోలు చేసినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. మూడు ప్రమోటరు సంస్థలు- యూరో పసిఫిక్ సెక్యూరిటీస్, ప్రైమ్ మెటల్స్, ఒరియానా ఇన్వెస్ట్మెంట్స్‌లకు ఒక్కో షేర్‌నురూ .13.30 చొప్పున 338.30 కోట్ల షేర్లను ఈ మూడు కంపెనీలకు అమ్మేందుకు వోడాఫోన్ బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ వాటా కేటాయింపు ద్వారా రూ .4,500 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా యూరో పసిఫిక్ సెక్యూరిటీస్‌కు 196 కోట్ల షేర్లు, ప్రైమ్ మెటల్‌కు 57 కోట్ల షేర్లు, ఒరియానా ఇన్వెస్ట్‌మెంట్‌కు 84 కోట్ల షేర్లను కేటాయిస్తారు.