6 వారాల్లో రూ. 30,000 కోట్లు చెల్లించండి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే తీర్పును అమరావతి హైకోర్టు వెలువరించింది. ప్రభుత్వం ఒకసారి
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కుదుర్చుకున్నాక… వాటిని మళ్ళీ సంప్రదింపులతో మార్చుకోవచ్చా అన్న అంశంపై కోర్టు నిన్న క్లారిటీ ఇచ్చింది. ఒప్పందాల్లో పేర్కొన్న ధరల ప్రకారమే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయాని, అన్ని పెండింగ్ బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ. 30,000 కోట్లను తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఏపీకి హైకోర్టు తాజా తీర్పు పెద్ద షాక్ అని చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామనే కారణంతో యునిట్ టారిఫ్ ధరలను తగ్గించాలని కోరలేవని.. ఆర్థిక ఇబ్బందుల నెపంతో పీపీఏల నుంచి తప్పుకోవడానికి వీల్లేదని కోర్టు ల్చిచెప్పింది. రాష్ట్రప్రభుత్వం, బకాయిలను చెల్లించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)లకు స్పష్టం చేసింది. యూనిట్ టారిఫ్ ధరలను సమీక్షించేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి వీలుకల్పించడంతో పాటు తాత్కాలిక చర్యల్లో భాగంగా సోలార్ యునిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని డిస్కమ్‌లకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఆ తరహా ఉత్తర్వులను ఇవ్వడం సముచితం కాదని అభిప్రాయపడింది.
డిస్కమ్‌ల పిటీషన్ల కొట్టివేత
ప్రస్తుత పీపీఏల వ్యవహారంలో యూనిట్ టారిఫ్ ధరలను సమీక్షించాలని ఏపీఈఆర్సీ వద్ద డిస్కమ్‌లు దాఖలు చేసిన రెండు ఒరిజనల్ పిటిషన్లకు విచారణార్హత లేదటూ వాటిని కొట్టివేసింది. పీపీఏలను సమీక్షించి యూనిట్ ధరలను నిర్ణయించేందుకు వీలుకల్పిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అలాగే పవన, సౌర విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో కోత పెట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఏపీఎస్‌ఎల్‌డీసీ (ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా కొట్టివేసింది. పవన, సౌర విద్యుత్ సంస్థలు ‘మస్ట్ రన్’ నిర్వచనంలోకి వస్తాయని, అవి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందేనని, ఉత్పత్తి తగ్గించాలని కోరలేరని తేల్చిచెప్పింది.