కార్వీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన రూ.1984 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. ఈడీ ఇవాళ జప్తు చేసిన ఆస్తుల్లో కార్వీ ఛైర్మన్ పార్థసారథికి చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. సంస్థతో పాటు ఆయనకు సంబంధించిన భూములు, భవనాలు, కంపెనీలో వీరి పేరున ఉన్న షేర్లను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కుంభకోణం సంబంధించి ఇప్పటికే పార్థసారథిని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రూ.700 కోట్ల షేర్లు జప్తు
గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను జప్తు చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణ జరుపుతోంది.