అప్పుల్లో తగ్గేదే లేదు…
ధనిక రాష్ట్రమైనా… అప్పులు తేవడంలో కేసీఆర్ ప్రభుత్వం తగ్గేదే లేదంటోంది. ఆదాయంతో పాటు అప్పులు కూడా తెలంగాణలో పోటీ పడి పెరుగుతున్నాయి. పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పథకాలను సమర్థంగా అమలు చేయడంతో పాటు కొత్త పథకాలను తెచ్చేలా ఉంది. అలాగే కొత్త పన్నుల జోలికి వెళ్ళకుండా ఉండాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం అదనపు ఖర్చును అప్పులతో సర్దడానికి ప్రయత్నిస్తోంది. 2022-23 బడ్జెట్ అంటే ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పన్ను రూపేణా రూ.1.93 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో నికరంగా రాష్ట్ర ప్రభుత్వ పన్ను వసూళ్ళు రూ.1.26 లక్షల కోట్లు మాత్రమే. అయితే ఈ సారి కూడా రూ.53,970 కోట్ల రుణం తెస్తామని ప్రభుత్వం అంటోంది. అంటే పన్ను ఆదాయంలో దాదాపు సగం అప్పులే అన్నమాట. గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం (సవరించిన అంచనా ప్రకారం) రూ.1.07 కోట్లు. కాని జనవరి నాటికే రూ.44,635 కోట్ల రుణం తెచ్చారు. కాని పూర్తి ఏడాది అంటే మార్చినాటికి పూర్తి రుణం రూ.47,500 కోట్లని సవరించిన లెక్కలు చూపారు. ఆ లెక్కన చూసినా గత ఏడాది కూడా రాష్ట్ర పన్ను ఆదాయంలో 45 శాతానికి సమానమైన అప్పులు చేశారు. 2022-23లో
50 శాతం సమానమైన రుణం తెస్తారన్నమాట.
మొత్తం రుణాలు ఇవి
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రుణాలు రూ.3.29 లక్షల కోట్లకు చేరుతాయి. 2019-20లో ఈ రుణాల మొత్తం రూ. 2.05 కోట్లు. కేవలం మూడేళ్ళలో 60 శాతానికి పైగా రుణాలు తెచ్చారన్నమాట. ప్రభుత్వం చేసిన రుణాల్లో అధిక మొత్తం అధిక వడ్డీకి ఓపెన్ మార్కెట్ నుంచి తెచ్చినవే. మొత్తం 3.29 లక్షల కోట్లలో ఓపెన్ మార్కెట్ రుణాలు రూ. 2.89 కోట్లు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన రుణాలు రూ. 7188 కోట్లు, స్వతంత్ర సంస్థల నుంచి తెచ్చిన రుణం రూ. 13,591 కోట్లు. ఇక చిన్న పొదుపు ఖాతాలు, ప్రావిడెంట్ ఫండ్ నిధి నుంచి తీసుకున్న రుణ మొత్తం రూ. 19,336 కోట్లు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో రుణాల మొత్తం 25 శాతానికి చేరింది.
వడ్డీల భారం
2020-21లో ఏడాదికి రూ. 16841 కోట్ల వడ్డీ కట్టిన తెలంగాణ ప్రభుత్వం 2021-22లో రూ. 17,584 కోట్ల వడ్డీ కడుతోంది. 2022-23 ఆర్థిక భారం మరింత పెరిగి రూ. 18,911 కోట్లకు చేరనుంది.అయితే ఈ ఏడాది ప్రభుత్వం చేసే అర లక్షకు పైగా రుణాలపై వడ్డీ భారం భారీగా పెరగనుంది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ వడ్డీ రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి.