డిజిటల్ కరెన్సీ వచ్చే ఏడాదే
బడ్జెట్లో ప్రకటించిన డిజిటల్ కరెన్సీ 2023 ప్రారంభంలో వచ్చే అవకాశముంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీల ఎలక్ట్రానిక్ వాలెట్ల మాదిరే ఇది పనిచేస్తుందని, అయితే వీటికి ప్రభుత్వ సార్వభౌమత్వం ఉండటం వీటి ప్రత్యేక అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022-23లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పేరుతో ఆర్బీఐ సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రతి కరెన్సీ నోటుకు ప్రత్యేక సంఖ్య ఉన్నట్లే .. ఆర్బీఐ జారీ చేసే డిజిటల్ కరెన్సీ యూనిట్ల రూపంలో ఉంటుంది. చెలామణిలో ఉన్న నగదులో భాగంగానే ఇవీ ఉంటాయి. ప్రైవేటు వర్చువల్ కరెన్సీల (క్రిప్టో కరెన్సీలకు) భిన్నంగా సీబీడీసీ ఉంటుందని అధికార తెలిపాయి. క్రిప్టోలను ఎవరు జారీ చేస్తారో తెలియదు కనుక, ఒక వ్యక్తి రుణాలు, చెల్లింపు బాధ్యతలను గుర్తించే వీలు లేదు.