ఎల్లుండి టాటాల చేతికి…
డిజిన్వెస్ట్‌మెంట్‌లో చేజిక్కించుకున్న ఎయిరిండియాను ప్రభుత్వం ఈ నెల 27 న టాటాలకు అప్పగించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఎయిరిండియా బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టికను తయారు చేసి ఈ నెల 24 న టాటాలకు అందించారు. బ్యాలెన్స్ షీట్ ముగింపు తేదీ జనవరి 20గా పేర్కొన్నారు. ఈ బ్యాలెన్స్ షీట్‌ను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేంద్రంతో సంప్రదించడానికి మూడు రోజుల సమయం కేంద్రం ఇచ్చింది. బ్యాలెన్స్ షీట్ పట్ల టాటాలు సమ్మతమైతే ఈనెల 27న కంపెనీని అప్పగిస్తారు. డిజిన్వెస్ట్‌మెంట్ విజేతగా నిలిచిన టాటాలకు గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. డిసెంబర్‌లోగా వంద శాతం కంపెనీని అప్పగిస్తామని పేర్కొంది. వివిధ రకాల అనుమతులు రావడంలో ఆలస్యం కావడంతో ఈ నెల 27న కంపెనీని అప్పగించనున్నారు. కంపెనీని టాటాలకు అప్పగిస్తున్న అంశాన్ని ఉద్యోగులకు తెలిపారు. బిడ్డింగ్‌లో రూ.18,000లకు ఎయిర్ ఇండియాను టాటాలు దక్కించుకున్నారు. ఇందులో రూ. 15,300 కోట్లు రుణం. మిగిలిన రూ. 2,700 కోట్లు మాత్రమే కేంద్రానికి నగదుగా అందింది.