600 ఎకరాలు కొన్న హెటెరోడ్రగ్స్
ఇటీవల వందల కోట్ల నోట్ల కట్టలతో ఐటీ అధికారులకు పట్టుబడిన హెటెరో డ్రగ్స్ హైదరాబాద్ నగర శివార్లలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అమెరికాకు చెందిన ఓ ఫండ్ నుంచి ఈ భూములు కొనుగోలు చేసింది. అమెరికా ఫండ్‌కు భారత్‌లో రెండు కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 600 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ రెండు కంపెనీలను టేకోవర్ చేయడం ద్వారా ఆ భూములను హెటిరో డ్రగ్స్ దక్కించుకుంది. ఒక్కో ఎకరా రూ. 60 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ డీల్ కింద హెటెరో డ్రగ్స్ రూ.360 కోట్లు చెల్లించినట్లు ఎకనామిక్ టైమ్స్ రాసింది. 2017లో బెంగళూరుకు చెందిన పురవంకర గ్రూప్ నుంచి రాయిదుర్గ్ ఐటీ బెల్ట్‌లో ఉన్న 20 ఎకరాలను రూ. 475 కోట్లకు హెటెరో కొనుగోలు చేసింది. ఈ భూమిని జాయింట్‌గా అభివృద్ధి చేసేందుకు బెంగళూరుకు చెందిన ఆర్ఎంజడ్ కార్ప్, కె రహేజా గ్రూప్‌తో హెటిరొ డ్రగ్స్ ఒప్పందం చేసుకుంది.