షాక్: వడ్డీ రేట్లు పెంచిన బ్రిటన్
కరోనా మహమ్మారి ప్రవేశం తరవాత మొట్ట మొదటిసారిగా ఓ ప్రధాన దేశం వడ్డీ రేట్లను పెంచింది. కరోనా తరవాత అనేక దేశాలు భారీ ఎత్తున ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. అమెరికా,యూరప్, జపాన్ … లక్షల కోట్ల డాలర్ల విలువైన కరెన్సీని ప్రింట్ చేసి మార్కెట్లో పడేశాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతూ వచ్చింది. దాదాపు 38 ఏళ్ళస్థాయికి అమెరికాలో ద్రవ్యోల్బణం చేరింది. అలాగే యూరప్ దేశాల్లో కూడా. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో ద్రవ్యోల్బణం వచ్చే ఏప్రిల్ నాటికి ఆరు శాతం చేరుతుందని అంచనా వేశారు. వాస్తవానికి ఆ నెల నాటికి ద్రవ్యోల్బణం 2 శాతమే ఉంటుందని గతంలో అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి ద్రవ్యోల్బణం పెరగడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 0.1 శాతం నుంచి 0.25 శాతానికి పెంచింది. మానిటరీ పాలసీ కమిటీలో 9 మంది సభ్యులు ఉండగా, 8 మంది వడ్డీ రేట్లను పెంచేందుకు అంగీకరించారు. మార్కెట్ నుంచి ఇపుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బాండ్లను కొనుగోలు చేస్తోంది. అమెరికా మాదిరి బాండ్లను అధికంగా కాకుండా… ఇది వరకే నిర్ణయించిన స్థాయిలోనే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నిర్ణయంతో అమెరకిఆ డాలర్ భారీగా క్షీణించింది. యూరో మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.