రిలయన్స్ క్యాపిటల్‌లో రూ.2,500 కోట్ పీఎఫ్ నిధులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహిత పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్‌లో కార్మిక శాఖకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) రూ. 2500 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తాన్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ల రూపంలో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవాన్ కారద్ రాతపూర్వకంగా రాజ్యసభకు తెలిపారు. 2019 అక్టోబర్ నుంచి 2021 నవంబర్ 30వ తేదీ నాటికి రూ. 534.64 కోట్ల వడ్డీ కూడా ఈపీఎఫ్ఓకు రిలయన్స్ క్యాపిటల్ చెల్లించలేదని ఆయన వివరించారు. అయితే ఎన్సీడీల గడువు తేదీ ఇంకా ఉంది కాబట్టి. వాటిని డీపాల్ట్ అయినట్లుగా పరిగణించలేమని మంత్రి సభకు తెలిపారు. విచిత్రమేమిటంటే.. రిలయన్స్ క్యాపిటల్ దివాలా తీయడం. కంపెనీ దివాలా ప్రక్రియ ప్రారంభించమని ఆర్బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. మొత్తం, వడ్డీ కలిపి ఈపీఎఫ్ఓకు రూ.3,000 కోట్లకు పైగా రిలయన్స్ క్యాపిటల్ చెల్లించాల్సి ఉంది. దివాలా ప్రక్రియలో భాగంగా ఎవరైనా కంపెనీకి రుణపడి ఉంటే… అవి వసూలు చేసి ఇస్తారు. రిలయన్స్ క్యాపిటల్‌కు ఆస్తులకన్నా అప్పులే అధికంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మనీలైఫ్ వెబ్సైట్ ప్రకారం రిలయన్స్ క్యాపిటల్ నెట్‌వర్త్ మైనస్ రూ.15,912 కోట్లుగా ఉంది. అదే బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రకారం కంపెనీ నెట్‌వర్త్ మైనస్ రూ. 7,610 కోట్లు ఉంది.