For Money

Business News

మళ్ళీ రూ. 1,300 దిగువకు పేటీఎం.. కొనొచ్చా?

పేటీఎం ఆఫర్‌ ధర ఇప్పట్లో కన్పించకపోవచ్చు. లిస్టింగ్‌ రోజు నుంచి ఇప్పటికీ ఈ షేర్‌ నష్టాల్లోనే ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత భారీగా క్షీణించి రూ. 1271ని తాకిన పేటీఎం షేర్‌ తరవాత కోలుకుని రూ. 1800దాకా వెళ్ళింది. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత 30 రోజులకు యాంకర్‌ ఇన్వెస్టర్లపై ఉండే లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పూర్తవుతుంది. అలా పేటీఎం యాంకర్‌ ఇన్వెస్టర్లపై ఉన్న లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఇవాళ్టితో అయిపోయింది. దాంతో మళ్ళీ యాంకర్‌ ఇన్వెస్టర్లు అమ్మడం ప్రారంభించారు. గత కొన్ని రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ఈ షేర్‌ ఇవాళ 13 శాతం పడింది. సాధారణంగా ఐపీఓ నాడు షేర్లు కొననివారు… లాక్‌ ఇన్‌ పీరియడ్‌ అయిపోయే రోజు కొంటారు. అలా ఇవాళ కూడా పేటీఎంకు రూ.1296 వద్ద మద్దతు లభించింది. రూ. 1,381 వద్ద ముగిసింది. ఈ షేర్‌లో భారీ ర్యాలీ రావాలంటే ముందుగా రూ. 1750-రూ. 1800 స్థాయిని చాలా గట్టిగా దాటాలని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఇపుడున్న చార్ట్‌ ప్రకారం ఎవరైనా పేటీఎం షేర్‌లో కొనుగోలు చేయాలనుకుంటే రూ. 1150-1200 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని కొన్ని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు సలహా ఇస్తున్నాయి. ప్రస్తుత ధరలో కొనాల్సిన పనిలేదు. ఇప్పటికే కొనుగోలు చేసినవారు అమ్మాల్సిన పనిలేదంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లు రూ.1200 స్థాయి వరకు వెయిట్‌ చేయొచ్చు. కాని స్టాప్‌లాస్‌ మాత్రం రూ.1150గా పెట్టుకోవాలని వీరు సూచిస్తున్నారు.ఈ స్థాయి దిగువకు వెళితే మాత్రం పేటీఎంలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుందని అంటున్నారు.