సూచీలు గ్రీన్‌లో… షేర్లు నష్టాల్లో
సాధారణ ట్రేడింగ్ సెషన్స్‌లో ఆల్గో ట్రేడింగ్ ఎలా ఉంటుందో ఇవాళ ఇన్వెస్టర్లు చూశారు. ముఖ్యంగా టెక్నికల్ అనాలిస్ ఫాలో అయ్యే వారికి ఇవాళ పండుగే. ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా నిఫ్టికి 18,250 ప్రాంతంలో ఒత్తిడి రావడంతో, 17,990 ప్రాంతంలో మద్దతు అందడం ఇవాళ్టి స్పెషల్. నిఫ్టిని ఇవాళ ఓపెనింగ్‌లోనే అమ్మినవారు ఇవాళ భారీ లాభాలు పొందారు. నిఫ్టి ఇవాళ ప్రధాన మద్దతు స్థాయి 17,990 దిగువన అంటే 17,968 ప్రాంతంలో మద్దతు అందింది. అక్కడి నుంచి మిడ్ సెషన్ కల్లా గ్రీన్‌లోకి వచ్చేసింది. చివరి దాకా గ్రీన్‌లో ఉన్న నిఫ్టి కేవలం 2.30 నుంచి 3 గంటల దాకా రెడ్‌లో ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 10 పాయింట్ల లాభంతో 18,125 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి కనిష్ఠ స్థాయికి చేరినపుడు ఏకంగా 46 షేర్లు నష్టాల్లోకి చేరాయి. కేవలం ప్రైవేట్ బ్యాంకుల కారణంగా బ్యాంక్ నిఫ్టి ఏకంగా రెండు శాతం పెరిగింది. నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా అనేక షేర్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే నిఫ్టి తరువాతి ప్రధాన సూచీ అయిన నిఫ్టి నెక్ట్స్ కూడా 0.88 శాతం నష్టపోయింది. ఇక మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాల హోరు చాలా తీవ్రంగా ఉంది. ఈ సూచీ ఏకంగా రెండు శాతంపైగా నష్టంతో ముగిసింది.