8 నుంచి అమెరికాకు వెళ్ళొచ్చు…
నవంబర్ 8వ తేదీ నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. సరిహద్దు ప్రాంతాల ద్వారా దేశంలోకి వచ్చేవారికి, విమాన ప్రయాణం ద్వారా అమెరికాలోకి వచ్చేవారిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. పూర్తి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకుని ఉంటే చాలు. అలాగే కరోనా నెగిటివ్ రిపోర్టు సమర్పించాలి. దాదాపు 30 దేశాల ప్రయాణికులకు 2020 ఆరంభంలో అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, భారత్, బ్రెజిల్, చాలా వరకు యూరప్ దేశాల వారికి నవంబర్ మొదటివారం ఆంక్షలు ఎత్తివేస్తామని సెప్టెంబర్ 20న అమెరికా ప్రకటించింది. అప్పట్లో కచ్చిత తేదీ ప్రకటించలేదు. నవంబర్ 8 నుంచి ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఇవాళ ప్రకటించింది. అమెరికా యేతర దేశాలకు చెందిన పర్యాటకులు అమెరికాకు బయలుదేరే ముందే విమానాశ్రయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపాలి, అలాగే ఇటీవల చేయించుకున్న కరోన పరీక్ష నెగిటివ్ రిపోర్టును కూడా సమర్పించాల్సి ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో అమెరికాలో ప్రవేశించేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపితే చాలు, కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించాల్సిన పని లేదు. పూర్తి వివరాలు ఇవాళ మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశముంది.