ఇళ్ళ కొనుగోళ్ళకు ఈ నగరాలు బెస్ట్
ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదార్లకు అత్యంత అనుకూలమైన నగరంగా కోల్కతా టాప్లో ఉందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. తదుపరి స్థానాల్లో హైదరాబాద్, పుణె ఉన్నాయని వివరించింది. ‘1,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సగటు ఆదాయం హైదరాబాద్, కోల్కతా నగరాల్లోని ప్రజలకు అధికంగా ఉంది’ అని పేర్కొంది.2013 నుంచి 2021 మధ్యకాలంలో ఢిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, పుణె, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రజల్లో ఇల్లు కొనుగోలు చేసే శక్తి పెరిగినట్లు ‘హోమ్ పర్చేజ్ అఫోర్డబులిటీ ఇండెక్స్- 2021’ నివేదికలో వివరించింది. గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గడం, ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉండటం రియల్ ఎస్టేట్ రంగానికి కలిసొస్తోందని వెల్లడించింది. ఈ ఏడాదిలో కుటుంబ ఆదాయాలు గత ఏడాదితో పోల్చితే 7-9% మేరకు పెరిగాయని, గృహ రుణాలపై వడ్డీరేట్లు 15 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ఫలితంగా ఇంటి కొనుగోలుదార్ల ఈఎంఐల భారం తగ్గడం కూడా సానుకూల పరిణామాలేనని పేర్కొంది. ముంబైలో ఈ సూచీ గణనీయంగా పెరిగిందని, కొనుగోలు శక్తి పెరుగుదల పరంగా కోల్కతా ఉత్తమ మార్కెట్ అని జేఎల్ఎల్ తెలిపింది.