రూపాయిని నిలువునా ముంచేశారు
దేశ చరిత్రలో తొలిసారి ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ విలువ 97 దిగువకు పడిపోయింది. భారత ఫారెక్స్ మార్కెట్ క్లోజింగ్ సమయానికి అమెరికా డాలర్‌తో రూపాయి మారకం 96.83-96.84గా ఉంది. ఇప్పటి వరకు డాలర్ రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి 96.96. ఈ ఏడాది మే 20వ తేదీన ఈ రికార్డు నమోదు అయింది. పెరుగుతున్న క్రూడ్ దిగుమతి బిల్లుతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్ళిపోతుండటంతో ఎక్కడ లేని డిమాండ్ వస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు పోతే ఏమిటి? మన దేశీ ఇన్వెస్టర్లు ఉన్నారంటూ పార్లమెంటు సాక్షిగా ఎద్దేవా చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… తరవాత డాలర్ల సమీకరణ కోసం ఏకంగా కొత్త పథకాన్ని మార్కెట్‌లోప్రవేశ పెట్టారు. దేశీ ప్రజలకు ఇవ్వని ప్రయోజనాలు ఎన్నారైలకు ఇచ్చారు. డాలర్లలో డిపాజిట్లు పెట్టినవారికి…దానిపై కూడా రుణం ఇచ్చారు. వడ్డీని తిరిగి విదేశాలకు తీసుకెళ్ళడానికి అనుమతించారు. పైగా ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ట్యాక్స్ నుంచి మినహాయించారు. ఇలా ఏకంగా 13,300 కోట్ల డాలర్లను సేకరించారు. అమ్మయ్య… ఇక మన డాలర్ల బెడద లేదని అనుకుంటుండగానే…. మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింత పెరిగాయి. ఫారెక్స్ తాత్కాలిక బాండ్ల జారీ కూడా హద్దులు మీరడంతో… తన వద్ద డాలర్లను ఆర్బీఐ మార్కెట్‌లో విడుదల చేస్తూ వచ్చింది. అవి కూడా అయిపోతున్నాయేమో… లేదా ఉద్దేశపూర్వకంగా… రూపాయిను ఫారెక్స్ మార్కెట్‌లో వొదిలేశారు. ఇపుడు మార్కెట్ ముగిసిన తరవాత జరిగే లావాదేవీల్లో డాలర్‌తో రూపాయి విలువ 97ను క్రాస్ చేసింది. ప్రస్తుతం 97.151ని తాకింది. ఈ స్థాయిలో రూపాయి పతనం కావడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పలు పొరుగుదేశాల కరెన్సీ కన్నా దారుణంగా మన కరెన్సీ విలువ పడిపోతోంది. మరి దీనికి స్టాక్ మార్కెట్ రేపు ఎలా స్పందిస్తుందో చూడాలి.
