PSU బ్యాంకులకు కరువు షాక్
ఇవాళ స్టాక్ మార్కెట్ పతనంలో బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషించాయి. గత శుక్రవారం వదంతుల కారణంగా భారీగా క్షీణించిన ఫెడరల్ బ్యాంక్ ఇవాళ కోలుకుని స్వల్ప లాభంతో ముగిసింది. అయితే మిగిలిన బ్యాంకులన్నీ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణంగా మహారాష్ట్రలోని 74 శాతం ప్రాంతాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించడం. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా కరువు ప్రాంతాలకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కరువు తీవ్రత అధికంగా ఉంది. పైగా ఈ రెండు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు కావడంతో దీని ప్రభావం ఆ రాష్ట్రాలపైనే గాక.. ఆర్థిక సంస్థలపై కూడా ఉంటోంది. ఇప్పటికే బంగారం ధరల తగ్గడంతో తాకట్టు రంగంలో ఉన్న NBFC కంపెనీల షేర్లు బాగా పడ్డాయి. ఇపుడు బ్యాంకు రుణాలపై కరువు ప్రభావం ఉంటుందన్న ఆందోళనతో ఇవాళ బ్యాంకు షేర్లు పడ్డాయి. నిఫ్టి బ్యాంక్ సూచీ ఇవాళ ఏకంగా 2 శాతం క్షీణించింది. అత్యధికంగా ఎస్ బ్యాంక్ ఆరు శాతం క్షీణించగా, ఎస్బీఐ కూడా రెండు శాతంపైగా పడింది. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకు ఎస్బీఐ. ఈ బ్యాంక్ రూ. 654 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 583 కోట్లు రుణంగా ఇచ్చాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో రూ. 462 కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రభాగంలో ఉంది. ఇవాళ ఈ బ్యాంక్ షేర్ కూడా రెండు శాతంపైగా పడింది. మున్ముందు మరిన్ని రాష్ట్రాలు కరువు ప్రాంతాలకు ప్రకటించే అవకాశముంది. ముఖ్యంగా మధ్య భారత్తో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కరువు ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.
