For Money

Business News

బేర్‌మన్న Gen Z ఇన్వెస్టర్లు

మోదీ ప్రధాని వచ్చిన తరవాత స్టాక్‌ మార్కెట్లు భారీగా పెరిగాయన్న ప్రచారం జోరుగా ఉంది. వాస్తవానికి మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే మార్కెట్‌ పెరగడమే కాదు, స్థిరంగా ఉంది. అయితే మోదీ హవాను Gen Z భారీ ప్రచారంతో ముందుకు తీసుకెళ్ళింది. ఇపుడు యుద్ధం వల్ల మార్కెట్‌ పడుతోంది. వాస్తవానికి మార్కెట్లు 2022 తరవాత నుంచే పెరగడం ఆగిపోయాయి. ఒకనెల పెరగడం, మరో నెలలో పడటం… ఇలా సగటున చూస్తే పెద్దగా పెరిగింది లేదు. సగటున చూస్తే 2022లో నాలుగు పెరగ్గా, 2023లో 20 శాతం పెరిగింది. అలాగే 2024లో పెద్దగా పెరిగింది లేదు. అలాగే 2025 ఏడాది అంతా డల్‌గా ఉన్న నిఫ్టి ఏడాది చివరల్లో పది శాతం నమోదు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 శాతం తగ్గింది. ఇది నిఫ్టి పయనం. అయితే షేర్లను విడిగా తీసుకుంటే… ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. అనేక మంది ఇన్వెస్టర్ల పోర్టుఫోలియో కనీసం 30 నుంచి 50 శాతం క్షీణించాయి. సూచీలు గ్రీన్‌లో ఉన్నా… స్థిరంగా ఉన్నా… షేర్లు మాత్రం భారీగా క్షీణించడమే దీనికి కారణం. ఇదే సమయంలో మార్కెట్‌ పెరిగే సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు స్వల్ప లాభాలకే బయటపడతారు. కాని పడే సమయంలో వెంటనే బయటకి రారు. చాలా సందర్భాల్లో మార్కెట్‌ ఆ ఛాన్స్‌ ఇవ్వదు. ముఖ్యంగా యుద్ధం తరవాత మార్కెట్‌లో రోజుకు ఒక శాతంపైగా పడుతోంది. ఒక్కోసారి రెండు శాతం పడుతోంది. అంటే షేర్లు ఏకంగా అయిదు శాతం లోయర్‌తో ప్రారంభమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో చూస్తూ చూస్తూ ఇన్వెస్టర్లు నష్టాన్ని బుక్‌ చేయరు. ఇది సాధారణ ఇన్వెస్టర్‌ బలహీనత. అదే ఇపుడు వారిని పూర్తిగా నష్టాల్లో ముంచింది. ప్రొఫెషనల్‌ ఇన్వెస్టర్లు చాలా వరకు ముందే బయటపడతారు. నష్టం బుక్‌ చేయడం వారికి అలవాటు. కాని కొత్తగా మార్కెట్లో వచ్చిన ఇన్వెస్టర్లు ముఖ్యంగా Gen Z ఇన్వెస్టర్లు లాస్‌బుక్‌ చేయలేదు. ఎందుకంటే వారు ఇలాంటి బేర్‌ ఫేజ్‌ ఇప్పటి వరకు చూడలేదు. ఒకవేళ పడితే… ఇంకెంత పడుతుందా అన్న ధీమా వారిని ముంచేసింది. మార్కెట్‌పై, తమ సొంత ప్లాన్‌పై విపరీతమైన నమ్మకం వారిని నష్టాలపాలు చేసింది. ఒక షేర్‌లో 50 శాతం నష్టం వస్తే… మళ్ళీ పాత స్థాయికి వెళ్ళాలంటే ఆ షేర్‌ 75 శాతం లాభసడాల్సి ఉంటుంది. ఈ లెక్కలు కూడా Gen Zకి తెలియవు. మార్కెట్‌ ఎంత కర్కశంగా ఉంటుందో తొలిసారి Gen Zకి తెలిసి వస్తోంది. స్టార్‌ స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా తరచూ చెప్పేవారు. 15 శాతం వార్షిక రిటర్న్‌ సాధిస్తే… ఆ ఇన్వెస్టర్‌ మార్కెట్‌ కింగ్‌ అని. దీర్ఘకాలిక ఇన్వెస్టింగ్‌ స్థిరంగా 10 నుంచి 12 శాతం లాభం సాధించడం మార్కెట్‌లో చాలా కష్టం. తొలిసారి ఈ సూత్రం Gen Zకి తెలిసివస్తోంది.