For Money

Business News

ఎందాక… రూ. 95 దాకా లేదా రూ. 100?

కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది రూపాయి. యుద్ధం కారణంగా ఒకవైపు పెరుగుతున్న క్రూడ్‌ ధరలు, మరోవైపు పతనమౌతున్న స్టాక్‌ మార్కెట్‌. క్రూడ్‌ ధర పెరిగే కొద్దీ కేంద్ర ప్రభుత్వం రోజూ వేల కోట్ల రూపాయల అదనపు భారం మోయాల్సి వస్తోంది. స్పాట్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు 156 డాలర్లు దాటినట్లు సమాచారం. కొన్ని రోజుల్లోనే క్రూడ్‌ ధర డబుల్‌ అయ్యింది. దీంతో డాలర్ల అవసరం పెరిగింది. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను అమ్ముతున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు రూ. 84 వేల కోట్ల రూపాలయ విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు అమ్మారు. వీరికి డాలర్లను సర్దాల్సి ఉంది. ఇదే సమయంలో అనేక మార్కెట్లకు ఎగుమతులు ఆగాయి. దీంతో రావాల్సిన స్థాయిలో డాలర్లు రావడం లేదు. ఇటీవల అమెరికా, బ్రిటన్‌ నుంచి ఎన్నారైలు రెమిటెన్స్‌లు పంపడం లేదు. ఇపుడు గల్ఫ్‌ దేశాల నుంచి కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఒక స్థాయికి మించి డాలర్లను సర్దడం లేదు. దీంతో రూపాయి విలువ భారీగా పడుతోంది. యుద్ధం ముగింపు ఎపుడనే అంశంపై ఇంకా ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఆయన చెప్పొదొకటి.. చేసేదొకటి. పైగా చపల మనస్తత్వం. ఎపుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియడం లేదు. ఈ అనిశ్చితిలో డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఐటీ ఎగుమతుల్లో కూడా స్పీడు తగ్గింది. నిన్న శుక్రవారం ఒక్క సెషన్‌లోనే రూపాయి 1.15 శాతం క్షీణించి, డాలర్‌తో పోలిస్తే 93.72 వద్ద సరికొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది. 2022 ఫిబ్రవరి 24 తర్వాత ఒక్కరోజులో ఇంత తీవ్రంగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఇంట్రాడే రూపాయి 93.77ను కూడా తాకింది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూపాయి 8.8 శాతం క్షీణించింది. 2014లో రూపాయి 9.37 శాతం బలహీనపడగా, ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే ఇప్పటివరకు 2.92 శాతం క్షీణించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్లను అమ్మడం ద్వారా మార్కెట్‌ జోక్యం చేసుకుందని, దీంతో కొంత మేర రూపాయి పతనాన్ని ఆపగలిగిందని ఫారెక్స్‌ మార్కెట్‌ వ్యాపారులు అంటున్నారు. ఈ మాత్రం జోక్యం చేసుకోక పోతే ఇప్పటికే రూపాయి 95 స్థాయికి పడేదని వీరు అంటున్నారు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత క్రూడ్‌ బాస్కెట్ ధర 120 శాతం పెరిగి 156 డాలర్లకు పెరిగింది. మార్చి మధ్య నాటికి ఆర్‌బిఐ వద్ద లక్ష కోట్ల రూపాయల మేరకు ఓవర్‌సోల్డ్ పొజిషన్లు ఉన్నాయని ఫారెక్స్‌ డీలర్లు అంటున్నారు. మున్ముందు వాటిని ఆర్బీఐ తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుందని వీరు తెలిపారు. వీటిలో కనీసం 30 శాతం రెండేళ్లకు పైబడిన కాలపరిమితి ఉన్నవి కావడం కాస్త ఊరటనిచ్చే అంశమని ఫిన్‌రెక్స్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, హెడ్ ఆఫ్ ట్రెజరీ అనిల్ కుమార్ భన్సాలీ అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు నెలల్లో USDINR 95కి చేరడం ఖాయమని, ఆ తరవాత టార్గెట్‌ 100 అని అంటున్నారు. ఇదంతా యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే అంశంపై ఆధారపడి ఉంటుందని ఎకనమిస్టులు అంటున్నారు.

Leave a Reply