95 దిశగా రూపాయి పతనం?
భారత ప్రధానిగా మోదీ తొలిసారి ప్రమాణం చేసినపుడు డాలర్‌తో రూపాయి విలువ 60 ప్రాంతంలో ఉండేది. ఎన్నికల ముందు 58 లేదా 59 మధ్యలో ఉండేది. మోదీ హయాంలో ఇపుడు 93ని దాటింది. ఇవాళ USD INR డాలర్ 93.36ని తాకింది. అంటే 60 శాతంపైగా క్షీణించిందన్నమాట. విదేశాల నుంచి భారీ మొత్తంలో రుణం తెచ్చినందున మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నా… రూపాయి విలువ కాపాడేందుకు భారత రిజర్వు బ్యాంక్ కొన్ని వందల కోట్ల డాలర్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర 71,700 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు, పెట్టుబడి దారుల నుంచి డాలర్ కోసం డిమాండ్ వస్తే ఆర్బీఊ ఫారెక్స్ మార్కెట్‌లో బాండ్లను జారీ చేయడం ద్వారా డాలర్ చెల్లింపులను వాయిదా వేస్తోంది. ఇలా ఇప్పటి దాకా అమ్మిన ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌ల విలువ 10,000 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. గత రెండేళ్ళుగా విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. కొందరు రుణ సాధానాల్లో పెట్టుబడి పెడుతున్నా… తమ దేశాలకు చాలా మంది ఇన్వెస్టర్లు తీసుకెళ్ళి పోతున్నారు. వీరికి విదేశాల్లోనే ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌ల రూపంలో ఆర్బీఐ చెల్లిస్తోంది. సాధ్యమైనంత వరకు స్వల్ప కాలిక కాంట్రాక్ట్‌లను అమ్ముతోంది. ఏడాది గడువు ఉన్న కాంట్రాక్ట్‌లను కూడా అమ్ముతోంది. అయితే ఇపుడు ఇవ్వాల్సిన డాలర్లను మున్ముందుకు వాయిదా వేయడం ఎంత వరకు మంచిది? భవిష్యత్తులో పెద్ద భారం కాదా? అని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక డాలర్ల ప్రవాహం యుద్ధం కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే అమెరికా ఎన్నారైలు భారత్‌కు డాలర్లు పంపడం తగ్గించారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ పడకేయడంతో పాటు ట్రంప్ పన్నులు భయంతో చాలా మంది పంపడం లేదు. ఐటీ ఎగుమతుల్లో పెద్ద పురోగతి లేదు. ఏఐ దెబ్బకు ఐటీ ఎగుమతులు నామమాత్రంగా పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో గల్ఫ్ యుద్ధం వచ్చింది. అమెరికా, బ్రిటన్ రెండు దేశాల్లోని ఎన్నారైలు ఎంత పంపుతారో అంతకన్నా ఎక్కువ సొమ్ము గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఇపుడు అక్కడ పరిస్థితి బాగా లేదు. డాలర్లపై ప్రభావం పడుతోంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది. ఈ నేపథ్యంలో రూపాయి రోజు రోజుకీ బక్కచిక్కిపోతోంది.
