ఈరోజు ఐటీ షేర్ల వంతు
మార్కెట్ ప్రస్తుతానికి ఉత్సాహంగా ఉంది. గిఫ్ట్‌నిఫ్టి సూచించిన స్థాయి కన్నా మెరుగైన లాభాల్లో నిఫ్టి ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు నిఫ్టి 148 పాయింట్ల లాభంతో 23729 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఐటీ షేర్లు జోరుగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా డల్‌గా ఉన్న ఈ కౌంటర్లలో ఇవాళ కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది. నిఫ్టి 50 టాప్ గెయినర్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాతో పాటు హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. నిన్న ఈ షేర్లన్నీ టాప్‌లూజర్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక నిఫ్టి 50లో 44 షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉండగా, లూజర్స్‌లో కేవలం ఆరు షేర్లు ఉన్నాయి. కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్ టాప్‌లూజర్స్‌లో టాప్‌లో ఉన్నాయి. కోల్ ఇండియా మినహా మిగతా షేర్లలో పెద్ద ఒత్తిడి లేదు. ఇవాళ కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలతో పాటు బ్లూస్టార్ వంటి ఏసీ విక్రయ కంపెనీలకు మద్దతు లభిస్తోంది. చాలా రోజుల తరవాత ఎన్‌బీఎఫ్‌సీ కౌంటర్లలో ఆసక్తి కన్పిస్తోంది. మెటల్ షేర్లలో హిందుస్థాన్ జింక్ రెండు శాతంపైగా నష్టంతో ఉంది.
