తగ్గిన LPG అమ్మకాలు
మనదేశంలో ఎల్‌పీజీ అమ్మకాలు తగ్గడం చాలా అరుదు. వాణిజ్య సిలిండర్లపై నిషేధం విధించడంతో ఈసారి వీటి అమ్మకాలు తగ్గాయి. మార్చి నెల తొలి 15 రోజుల్లో ఎల్‌పీజీ అమ్మకాలు 17 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటల్‌తోపాటు పలు పరిశ్రమలపై ప్రభావం పడింది. మనదేశ ఎల్‌పీజీ డిమాండ్‌లో 90 శాతం సరఫరా గల్ఫ్ దేశాల నుంచే వస్తోందని కేంద్ర చమురు శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపారు. గల్ఫ్ యుద్ధం కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై నియంత్రణలు ఉన్నాయని, అందువల్లే అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ఆగిపోవడం వల్ల ఏటీఎఫ్ అమ్మకాలు కూడా 4 శాతం తగ్గాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఎల్‌పీజీ సరఫరా లేకపోవడం అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. కార్మికులకు ఆహార సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారిందని అంటున్నారు. క్యాంటిన్లకు సెలవు ఇస్తే కార్మికులపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నాయి. మరోవైపు కార్మికుల కొరత కూడా ఉంది. హోలికి సెలవు తీసుకున్న కార్మికులు ఇంకా రాకపోగా, రంజాన్ సందర్భంగా పలువురు సెలవులు పెడుతున్నారని కంపెనీ వర్గాలు అంటున్నారు. దీంతో కార్మికులను మేనేజ్ చేయడం పెద్ద సమస్యగా మారిందని కంపెనీలు తెలిపాయి.
