షార్ట్… షార్ట్… అంతా అదే
భారత స్టాక్ మార్కెట్ షార్ట్స్‌తో నిండిపోయింది. యుద్ధం ప్రారంభమైన తరవాత మార్కెట్‌లో షార్ట్స్ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఎఫ్‌ఐఐల ధాటికి దేశీయ ఆర్థిక సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి. సాధారణ ఇన్వెస్టర్ మార్కెట్‌కు దూరమైపోయాడు. ఉన్న షేర్లు అమ్మడం వినా.. కొనేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో ఇప్పటి వరకు ఎఫ్ అండ్ ఓలో షార్ట్ పొజిషన్స్ తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇపుడు క్యాష్ మార్కెట్‌లో కూడా అమ్ముతున్నారు. దీంతో సూచీలు ఐస్ ముక్కల్లా కరిగిపోతున్నాయి. మరోవైపు యుద్ధం ఎపుడు ఆగుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అలాగే ఇన్వెస్టర్ల నుంచి ఈక్విటీ ఫండ్స్‌లో ఫండ్స్ ప్రవాహం తగ్గింది. దీంతో దేశీ ఆర్థిక సంస్థలు ఆచితూచి మార్కెట్‌లో కొనుగోళ్ళు చేస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మార్కెట్‌లో ఉన్న కాంట్రాక్ట్‌లలో 90 శాతంపైగా కాంట్రాక్ట్‌లు షార్ట్స్‌లోనే ఉన్నాయి. F&Oతో పాటు క్యాస్ మార్కెట్‌లో ఎఫ్‌ఐఐ అమ్మకాలు జరపడంతో సాధారణ ఇన్వెస్టర్లు కూడా హెడ్జింగ్ లేకుండా షార్ట్ చేస్తున్నారు. గతవారం ఎఫ్‌ఐఐల నికర అమ్మకాలు రూ. 35,052 కోట్లు పైనే.
గత 9 ట్రేడింగ్ సెషన్స్‌లో ఎఫ్‌ఐఐ అమ్మకాలు రూ. 57,000 కోట్లకుపైనే ఉన్నట్లు ఎక్స్ఛేంజీ డేటా చూపుతోంది. ఇపుడు సిస్టమ్‌లో 2,60,540 కాంట్రాక్ట్స్‌లు నికర షార్ట్‌లో ఉన్నాయి. అంటే 90.07 శాతం షార్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట. అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్‌లో ధరలు తగ్గే వరకు మన మార్కెట్‌లో నికర అమ్మకాలే ఉండే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇపుడు బ్రెంట్ క్రూడ్ 104 డాలర్ల వద్ద ఉంది. కరోనా సమయం నాటి ధరలు ఇపుడు క్రూడ్ మార్కెట్‌లో కన్పిస్తున్నాయి. ఇరాన్ చమురు క్షేత్రాలను అమెరికా టార్గెట్ చేస్తోంది. ఇలా చేసే కొద్దీ హర్ముజ్ జలసంధి వ్యవహారం మరింత క్లిష్టం కానుంది. దీంతో క్రూడ్ ధరలు తగ్గకపోతే భారత్ వంటి మార్కెట్‌లలో షేర్లు పెరిగే ఛాన్స్ లేదని అంటున్నారు అనలిస్టులు. పైగా డాలర్ ఇండెక్స్ ఇంకా పెరుగుతూనే ఉందని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 100 డాలర్ల వద్ద డాలర్ ఇండెక్స్ ఉంది. ఈ స్థాయి డాలర్‌తో 104 డాలర్లతో బ్రెంట్ క్రూడ్ కొనడమంటే భారత వంటి వర్ధమానదేశాలకు చాలా కష్టమని అనలిస్టులు అంటున్నారు. రష్యా కూడా ఇపుడు మార్కెట్ ధరకే అమ్ముతోందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీస్తోంది. భారత బడ్జెట్ అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యే పరిస్థితి నెలకొంది.
