లాభాల నుంచి నష్టాల్లోకి…

వాల్‌స్ట్రీట్ ఇవాళ లాభాలతో ప్రారంభమైనా… వెంటనే నష్టాల్లోకి జారుకుంది. చైనాపై ఆంక్షల విషయంలో ట్రంప్ కేబినెట్ రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ట్రంప్ విధానాల వల్ల ఆయన పాపులారిటీ ఏ అధ్యక్షుడికి లేనంత తక్కువకు పడిపోయిందన్న సర్వేలు కూడా ఇపుడు వైట్‌హౌస్‌లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ విధానాలపై ఆయన కేబినెట్‌లో భిన్నాభిప్రాయలు ఉన్నాయన్న వార్తలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. నాస్‌డాక్ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్ అండ్ పీ 500 సూచీ 0.7 శాతం నష్టంతో ఉంది. అయితే డౌజోన్స్ మాత్రం 0.27 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ డాలర్ ఇండెక్స కూడా నష్టాల్లో ఉంది. డాలర్ ఇండెక్స్ 100కు చేరుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో… మళ్ళీ 98ని తాకడంతో కరెన్సీ మార్కెట్ అంచనాలు కూడా గాడి తప్పుతున్నాయి. దీంతో బులియన్ మార్కెట్ గ్రీన్లోకి వచ్చింది. బంగారం ఒకటిన్నర శాతం లాభంతో ఉంది.