ఐటీ ఉద్యోగాలను తినేస్తున్న ఏఐ
ఐటీ ఉద్యోగులు భయపడినట్లే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం కన్పిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఐటీ పరిశ్రమపై ఆధారపడిన భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఐటీ ప్రభావం క్రమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఐటీ ఉద్యోగాలపై కోత వేస్తున్నాయి కంపెనీలు. గత ఏడాది నుంచే ఈ ట్రెండ్ ప్రారంభమైనా… ప్రస్తుత ఆర్థిక ఫలితాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కన్పిస్తోంది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించాయి. ఈ మూడు నెలల్లో ఈ కంపెనీలు 64వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నాయి. దీంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను కూడా బాగా తగ్గించాయి. ముఖ్యంగా తమకు తాము రాజీనామా చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 10 శాతంపైగా ఉండగా, ఆ స్థానాలను కంపెనీలు భర్తీ చేయడం లేదు. దీంతో ఉత్పాదకత ఆటోమేటిగ్గా పెరుగుతోంది. అంటే వంద మంది చేసే పనిని… 90 మంది ఉద్యోగుల చేత చేయిస్తున్నారు. దీంతో ఉత్పాదకత పెరుగుతోంది. అలాగే ఖర్చు కూడా తగ్గుతోంది. దీంతో కంపెనీ నామమాత్రపు లాభాలను చూపించగలుగుతున్నాయి. లేదంటే చాలా వరకు భారత ఐటీ కంపెనీలు నష్టాలు చూపించాల్సి వచ్చేవి. దీనికి ప్రధాన కారణంగా ఐపీ ఆధారిత సేవల్లోకి కంపెనీలు మారడం.. అలాగే ఏఐను ప్రవేశ పెట్టడం. రొటీన్‌గా చేసే అనేక పనులతో పాటు కోడింగ్ పనులను కూడా ఏఐ టెక్నాలజీ చేసేస్తోంది. ఉద్యోగుల పనితీరు కంటే ఏఐ పనితీరు మెరుగ్గా ఉంటోంది. పొరపాట్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో చాలా కంపెనీలు ఏఐవైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ ట్రెండ్ వర్ధమాన దేశాలకు ప్రమాదకరంగా మారుతుందని ఐఎంఎఫ్ చేసిన హెచ్చరిక… వాస్తవం కాబోతోంది. ఏఐ కారణంగా వర్ధమాన దేశాల్లో ఉద్యోగ అవకాశాలు 40 శాతం తగ్గుతాయని, అలాగే పేద దేశాల్లో ఈ తగ్గ్గుదల 20 శాతంపైగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్ కంపెనీలు ఏఐవైపు మొగ్గు చూపడంతో… భారత్ వంటి వర్ధమాన దేశాల కంపెనీలకు ఆర్డర్లు తగ్గుతున్నాయి. దీంతో తక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ఆర్డర్లను పూర్తి చేసి లాభాలు చూపించే ప్రయత్నంలో భారత కంపెనీలు ఉన్నాయి. నిజానికి డాలర్‌తో రూపాయి బలహీనపడటం… భారత కంపెనీలకు వరం. దీనివల్ల టర్నోవర్ పరిమాణం భారీగా ఉండాలి. అయినా అత్తెసరుగా వ్యాపరం ఉందంటే… వాస్తవానికి కంపెనీల టర్నోవర్ తగ్గినట్లే. అంతర్గతంగా లెక్కలన్నీ చూసిన ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్ మెంట్‌కు బ్రేక్ వేస్తున్నాయి. మరీ ముఖ్యమైన టెక్నాలజీ నిపుణుల తప్ప… ఇతరులను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మున్ముందు కూడా వ్యాపారం మెరుగుపడే పరిస్థితి లేదని ఐటీ కంపెనీలు బాహాటంగానే ప్రకటిస్తున్నాయి. వెరశి ఐటీ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందనే చెప్పాలి. దీని ప్రభావం ఐటీనే టార్గెట్‌గా పెట్టుకుని చదువుతున్న విద్యార్థులపై తీవ్రంగా పడనుంది.