ఇన్ఫోసిస్ లాభాల్లో క్షీణత
భారత ఐటీ కంపెనీల పనితీరు నిరాశాజనకంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా మాంద్యంతో పాటు ఏఐ దెబ్బ ఐటీ కంపెనీలపై బాగా కన్పిస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ లాభాలు తగ్గడం మార్కెట్‌ను ఆశ్చర్య పరుస్తోంది. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 6,586 కోట్ల నుంచి రూ. 6,106 కోట్లకు పడిపోయింది. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు కంపెనీ నికర లాభం రూ. 6,140 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఆ అంచనాలను కూడా కంపెనీ తప్పింది. కంపెనీ టర్నోవర్ కూడా కేవలం ఒక శాతం మాత్రమే పెరిగి రూ. 38,821 కోట్లకు చేరింది. తాజా మార్కెట్ పరిస్థితులను చూసిన తరవాత కంపెనీ తన గైడెన్స్‌ను సవరించింది. పూర్తి ఏడాదికి కంపెనీ వృద్ధి రేటు ఒక శాతం నుంచి 2.5 శాతం ఉంటుందన్న కంపెనీ.. ఇపుడు దీన్ని 1.5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.టీసీఎస్ 25 శాతం ప్రాఫిట్ మార్జిన్ చూపించగా.. ఇన్ఫోసిస్ మార్జిన్ 20.5 శాతానికే పరిమితమైంది. కంపెనీ వొదిలి వెళుతున్న ఉద్యోగుల శాతం ఏడాది క్రితం 24.3 శాతం ఉండగా… ఇపుడు 12.9 శాతానికి తగ్గింది.