ఈడీ కేసు: అదానీ చేతికి కంపెనీ?
తొలుత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడి చేయడం.. తరవాత అదే కంపెనీ అదానీ గ్రూప్ చేతికి పోవడం రివాజుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన జీవీకే గ్రూప్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్ ఇదే తరహాలో అదానీ చేతికి వెళ్ళిందని పలు రాజకీయ పార్టీలు విమర్శించాయి. ఇపుడు చెన్నైకి చెందిన కోస్టల్ ఎనర్జెన్ కంపెనీ కూడా ఇదే తరహాలో అదానీ చేతికి వెళ్ళనుంది. దేశీయ ప్రభుత్వ రంగ కంపెనీలకు నాసిరకం బొగ్గును దిగుమతి చేసుకుని సరఫరా చేసిందని కోస్టల్ ఎనర్జెన్ కంపెనీపై సీబీఐ, ఈడీలో కేసులు నమోదు చేశారు. దాదాపు రూ. 564 కోట్లు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించాయి. ఈ కేసు నడుస్తుండగానే బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించడం లేదని ఎస్బీఐ ఆధ్వర్యంలోని కన్సార్టియం కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టింది. సీబీఐ, ఈడీ కేసులతో ఈ కంపెనీ పనితీరు దెబ్బతింది. కంపెనీ ప్రమోటర్లు ఇచ్చిన సెటిల్మెంట్ ఆఫర్‌ను బ్యాంకులు తోసిపుచ్చాయి. 15 శాతం వాటాతో కలిపి రూ. 5847 కోట్లతో సెటిల్మెంట్కు ప్రమోటర్లు ముందుకు వచ్చినట్లు బిజినెస్ లైన్ పత్రిక రాసింది. రూ. 2327 కోట్ల సెటిల్మెంట్ను ఎస్బీఐతో కుదుర్చుకున్నట్లు కంపెనీ కూడా పేర్కొంది. అయితే తాజా సమాచారం మేరకు అదానీ వేసిన బిడ్‌కు రుణదాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెటిల్మెంట్ పూర్తి వివరాలు ఇంకా అదాల్సి ఉంది.